- ఎన్నికల ముందు గ్రామ వీధుల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు
- ఓటమి పాలవ్వడంతో ప్రతీకారంగా తొలగించిన అభ్యర్థి భర్త
టోంక్: ఎన్నికల ముందు ఆశలు రేపేలా వెలిగిన వీధి దీపాలు.. ఫలితాలు రాగానే ఒక్కొక్కటిగా ఊడిపోతుంటే ఊరు ఊరంతా అవాక్కైంది! రాజస్థాన్లోని టోంక్ జిల్లా పంచాయతీ సమితి ఎన్నికల తర్వాత జరిగిన ఈ ‘లైట్ల కటింగ్’ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. పీపలూ పంచాయతీ సమితి వార్డు-4 పరిధిలోని కుమ్హారోన్ కీ ఢాని, బేగంపుర, హనీఫ్గంజ్, బిజల్పుర వంటి గ్రామాల్లో సుమారు 50 ఎల్ఈడీ వీధి దీపాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే, పంచాయతీ సమితి సభ్యురాలిగా పోటీ చేసిన ప్రియాంక శర్మ ఓటమి పాలైన వెంటనే ఈ దీపాలను తొలగించే పని మొదలైంది.
గ్రామస్తుల అనుమానం..
బీజేపీ ఎమ్మెల్యే రాంసహాయ్ వర్మ పీఏ అలోక్ శర్మ ఈ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ సమితి ఎన్నికల్లో అలోక్ శర్మ భార్య ప్రియాంక శర్మ 4వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో తన భార్యకు ఓటేయలేదనే కోపంతో అలోక్ శర్మ వీధి దీపాలను తొలగించాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జైపూర్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ స్పందిస్తూ.. అక్రమంగా కనెక్షన్ ఇచ్చిన దీపాలను, బిల్లుల సమస్య ఉన్న దీపాల తొలగింపు చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. కాగా, కొత్తగా ఎన్నికైన సర్పంచులు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడంతో మిగిలిన దీపాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
